Health Insurance: సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా ప్రయోజనాలివే..
ఆరోగ్య బీమా గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో బీమా పరిమితిలో అయ్యే ఖర్చులను మాత్రమే బీమా కంపెనీలు భరిస్తాయి.
మిగతా ఖర్చులను సొంతంగా పెట్టుకోవాల్సిందే. కాబట్టి, ప్రాథమిక ఆరోగ్య బీమాతో పాటు సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా తీసుకుంటే అధిక చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేసుకోవచ్చు.
సూపర్ టాప్-అప్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది?
సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు లబ్ధిదారుల చికిత్సకు అయ్యే ఖర్చులను నిర్ణీత కవరేజీ ప్రకారం చెల్లిస్తాయి. కానీ, సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా పాలసీ పరిమితి దాటిన ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఉదా: రూ.12 లక్షల సూపర్ టాప్-అప్ పాలసీపై రూ.4 లక్షలు డిడక్టిబుల్ ఉంటే.. పాలసీదారుని ఆరోగ్య చికిత్స ఖర్చు రూ. 4 లక్షలు దాటితేనే సూపర్ టాప్-అప్ బీమా వారికి వర్తిస్తుంది. ఆ లోపు ఆసుపత్రి బిల్లుకు మీ బేస్ పాలసీ కవర్ ఉపయోగపడుతుంది
ఈ పథకాన్ని ఎలా కొనుగోలు చేయాలి?
రెగ్యులర్ ఆరోగ్య బీమా పాలసీతో లేదా విడిగా కూడా సూపర్ టాప్-అప్ పాలసీని తీసుకోవచ్చు. మొత్తం కుటుంబాన్ని ఒకే బీమా ప్లాన్ (ఫ్యామిలీ ఫ్లోటర్)లో లేదా వ్యక్తిగతంగా కవర్ చేయడానికి కూడా ఈ పాలసీని ఎంచుకోవచ్చు. సాధారణ ఆరోగ్య బీమాను ఒక సంస్థ నుంచి, సూపర్ టాప్-అప్ పాలసీని వేరే బీమా సంస్థ నుంచి కూడా పొందొచ్చు.
సూపర్ టాప్-అప్ పాలసీ అవసరమేనా?
2021లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఆసియా దేశాలలోనే భారత్ అత్యధిక వైద్య ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఈ రేటు 14% వరకు ఉంది. ఈ ద్రవ్యోల్బణ రేటు భారత్‌లో పెరుగుతున్న వైద్య ఖర్చులను సూచిస్తోంది. అంతేకాకుండా కొవిడ్ పరిస్థితుల్లో భారత్‌లో ఆసుపత్రి ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. రోగుల వైద్య చికిత్స బిల్లులు సాధారణ బీమా పరిధిని దాటిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోగుల/ వారి కుటుంబీకుల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి ఈ సూపర్ టాప్-అప్ పథకాలు గొప్ప వరంగా మారాయి. సూపర్ టాప్-అప్ పథకం ఉద్దేశమే బీమా కవరేజీ తగ్గకుండా చూడడం. కాబట్టి, రెగ్యులర్ ఆరోగ్య బీమా కవరేజీని పెంచుకోవడానికి సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా మంచి అవకాశమనే చెప్పాలి.
ఈ బీమా ప్రీమియం ఎంతుండొచ్చు?
ఏ దురలవాట్లూ లేని 30 ఏళ్ల వయసుగలవారు రూ.10 లక్షల సూపర్ టాప్-అప్ బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ. 3,000-8000 వరకు ఉండొచ్చు. అయితే, బీమా తీసుకున్న వారి వయసు, ఆరోగ్య చరిత్ర, అలవాట్లు, పాలసీ కవరేజీ, పాలసీ ఫీచర్లు ఆధారంగా ప్రీమియంలో మార్పులుంటాయి. చిన్న వయసులో పాలసీ తీసుకునేవారు సూపర్ టాప్-అప్ బీమా పథకం ద్వారా ఎక్కువ లబ్ధి పొందొచ్చు.
బీమా కవరేజీ
వైద్య చికిత్సలో భాగంగా ఆసుపత్రిలో చేరడానికి ముందు, తర్వాత ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. 24 గంటల ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేని డే-కేర్ చికిత్స ఖర్చులకు, అంబులెన్స్ ఛార్జీలకు, పాలసీ వ్యవధిలో ఏదైనా వార్షిక వైద్య పరీక్షలు, వైద్య ఖర్చులకు ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను పొందొచ్చు. రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉంటుంది.
బీమా కవరేజీ ఎక్కడ ఉండదు?
నవజాత శిశువు వైద్య ఖర్చులు, అవయవ దాతకు అయ్యే వైద్య ఖర్చులు, దంత చికిత్సలకు కవరేజీ ఉండదు. ప్లాస్టిక్ సర్జరీ, కళ్లకు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు, వినికిడి పరికరాలు, పుట్టుకతో వచ్చిన వ్యాధులకు, స్టెమ్ సెల్ ఇంప్లాంటేషన్ శస్త్ర చికిత్సలకు, డ్రగ్/ ఆల్కహాల్ సంబంధించి, సుఖ వ్యాధుల చికిత్స, హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్సలకు కవరేజీ ఉండదు. ఇంకా యుద్ధం జరిగే ప్రాంతాల్లో, విదేశీ దండయాత్రల వల్ల జరిగిన వైద్య ఖర్చులకు, అంతర్యుద్ధం మొదలైన వాటి వల్ల ఏర్పడిన వైద్య ఖర్చులకు ఈ బీమా వర్తించదు.
సీనియర్ సిటిజన్స్‌కు ఎలా ఉపయోగం?
60 ఏళ్ల పైబడిన వారికి ప్రాథమిక ఆరోగ్య బీమా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు సాధారణ బీమాను కనీస మొత్తంలో తీసుకుని అదనంగా సూపర్ టాప్-అప్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులను తట్టుకోవచ్చు.
ఇతర ప్రయోజనాలు
పాలసీని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. అన్ని ఇతర ఆరోగ్య బీమా పథకాల మాదిరిగానే ఈ పాలసీలో కూడా చెల్లించిన ప్రీమియంపై ఆదాయ పన్ను సెక్షన్ 80డి కింద రూ. 25,000-75,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
Thanks for reading Health Insurance: Super top-up health insurance benefits.
No comments:
Post a Comment