CBSE: విద్యార్థులూ.. ఆ ప్రచారం నమ్మొద్దు: సీబీఎస్‌ఈ విజ్ఞప్తి
దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్‌షీట్ల(Date sheets)పై బోర్డు ఉన్నతాధికారులు స్పందించారు. ఆ డేట్ షీట్లు నకిలీవని స్పష్టంచేశారు. పరీక్షల తేదీలను తాము ఇంకా ప్రకటించలేదని.. త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో వివిధ వెర్షన్లలో చక్కర్లు కొడుతున్న డేట్ షీట్లు నకిలీవి. పరీక్షల షెడ్యూల్‌ని త్వరలోనే విడుదల చేస్తాం. అధికారిక సమాచారం వచ్చే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు వేచి ఉండండి’’ అని సీబీఎస్‌ఈ బోర్డు సీనియర్ అధికారి ఒకరు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 10,12 తరగతుల థియరీ పరీక్షలు నిర్వహిస్తామని గతంలో బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు.
జనవరి 1నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని, అప్పటివరకు వీటికి సంబంధించిన సిలబస్‌ను పూర్తి చేయాలని పాఠశాలల్ని ఆదేశించినట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. 12వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలను బోర్డు నియమించిన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లు మాత్రమే నిర్వహిస్తారని.. అదే పదో తరగతికి ఇంటర్నల్ ఎగ్జామినర్లు నిర్వహిస్తారని వివరించారు. పూర్తి వివరాలకు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలపైనా ఇలాగే దుష్ప్రచారం జరగ్గా.. ఎన్‌టీఏ అధికారులు ఖండించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ కూడా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
Thanks for reading CBSE: Students... don't believe that speculation: CBSE appeal
No comments:
Post a Comment