Nasal Vaccine: నాసికా టీకా ధర డోసుకు రూ.800.. భారత్ బయోటెక్ వెల్లడి
భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన నాసికా టీకా (Nasal Vaccine) ధరను ఆ సంస్థ వెల్లడించింది. ఒక్క డోసు ధర ప్రైవేటులో రూ.800 (పన్నులు అదనం) ఉండనుందని తెలిపింది.
దిల్లీ: దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన నాసికా టీకా (Nasal Vaccine)ను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసు(Booster Dose)గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటులో అందుబాటులోకి రానున్న ఈ టీకా ధరను భారత్ బయోటెక్ వెల్లడించింది. సింగిల్ డోసు టీకా రూ.800 (పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.320కే ఇవ్వనున్నట్లు పేర్కొంది. ‘ఇంకొవాక్’ (iNCOVACC) పేరుతో లభ్యమయ్యే ఈ టీకా కొవిన్ (CoWIN) యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా జనవరి నాలుగో వారంలో మార్కెట్లోకి రానుంది.
ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ‘ఇంకొవాక్’ నాసికా టీకాను బూస్టర్‌గా పొందొచ్చు. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా అందుబాటులో ఉంటుంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ‘బీబీవీ154’గా పిలిచే ఈ నాసికా టీకా ‘ఇంకొవాక్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్ బయోటెక్ వెల్లడించింది.
Thanks for reading Nasal Vaccine: Bharat Biotech reveals price of nasal vaccine
No comments:
Post a Comment