Amarajeevi Sri Potti Sreeramulu Biography - Hunger strike for Separate state of Andhra
-ఆంధ్రప్రదేశ్ అవరతణకు మూలపురుషుడు -అమరజీవి’గా ప్రాచుర్యం పొందిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చనిపోయే దాకా ఆయన దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి? భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం .
అమరజీవి పొట్టి శ్రీరాములు
హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకుని ప్రచారం చేశారు. మండుటెండల్లో చెప్పులు, గొడుగు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.
’పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టగలను ' అన్నారు గాంధీజీ.
దేశభాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడాయన.
గతం తెలియని, తెలుసుకొనని జాతికి భవిష్యత్తు లేదు. ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజానికి రూపురేఖలు దిద్ది, నూతన జవ సత్త్వాలు ఇచ్చిన మహనీయుల జీవిత సర్వస్వమే గతం అనాలి.
సత్యం, అహింస, త్యాగం అనే మూడు మహా గుణాలు కలిసిన త్రివేణి సంగమంగా శ్రీరాములుగారి జీవిత కథ సాగింది.
ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు.
పొట్టి శ్రీరాములు
తల్లిదండ్రులు: గురవయ్య, మహాలక్ష్మమ్మ
స్వస్థలం: నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం
జననం: 16 వ తేది శనివారం, మార్చి 1901
మరణం: 15 వ తేది సోమవారం, డిసెంబర్ 1952
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
జీవిత విశేషాలు
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గరువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు.
ప్రకాశం పంతులు మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఉపవాసం చెయ్యడానికి ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే అట్టలు కట్టుకొని, వీధుల్లో తిరిగి ప్రాణాలైనా అర్పిస్తానన్న పట్టుదల గల మనిషి శ్రీరాములు’’. ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు బులుసు సాంబమూర్తి ముందుకొచ్చారు.
దీక్షా కాలంలో శ్రీరాములు పాటించిన దిన చర్యను డాక్టర్ కస్తూరి నారాయణ మూర్తి, డాక్టర్ అవధాని, డాక్టర్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించేవారు. గాంధీజీ తన నిరశన వ్రతాల్లో పాటించిన నియమాలనే ఇంచుమించు శ్రీరాములు కూడా అనుసరించారు.
ప్రతిరోజూ నాలుగు నిమ్మకాయల రసం, రెండు చెంచాల ఉప్పు, రెండు చిటికెల సోడా టైకార్బొనేట్, రెండు ఔన్సుల తేనె తీసుకునేవారు.
దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆయన్ను వైద్య బృందం పరీక్షించి, ఆ వివరాలను నమోదు చేసేది. శ్రీరాములు బరువు ఇలా తగ్గుతూ వచ్చింది.
మొదటి రోజు - 53.9 కేజీలు, 10వ రోజు - 48.5 కేజీలు, 26వ రోజు - 45.8 కేజీలు, 43వ రోజు - 42.6 కేజీలు, 58వ రోజు - 38.1 కేజీలు. (అమరజీవి సమరగాథ)
శ్రీరాములు మరణానికి కారకులెవరు?
పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు. నెహ్రూ తండ్రి నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. నెహ్రూ కూడా బుద్ధిమంతుడే. అయితే, ఈ సందర్భంలో న్యాయంగా వర్తించలేకపోయారు. 58 రోజులు ఇతను ఉపవాసం చేసినా కదలిక పుట్టలేదు. నెహ్రూ కొంత కాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు మరణించటానికి వారం రోజుల ముందు.. 1952 డిసెంబర్ 8వ తేదీన పార్లమెంటు లోక్‌సభలో ప్రధాని నెహ్రూ ఇలా అన్నారు.. ‘‘ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయము తేలికగా చూడరాదు. అయినప్పటికీ ముఖ్య నిర్ణయాలు చేసే విషయంలో ఈ విధంగా ఒత్తిడి తీసుకువచ్చే యెడల పార్లమెంటు అధికారము, ప్రజాస్వామ్య పద్ధతులు అంతమవుతాయి. ఇంతకంటే ఉత్తమ పద్ధతుల ద్వారా, ఇంతకంటే ఎక్కువ సక్రమ పద్ధతుల ద్వారా తన ఆశయాన్ని సాధించాలని ప్రాయోపవేశం చేస్తున్న మహాశయుణ్ణి కోరుతున్నాను.’’
9వ తేదీన మద్రాసు శాసన మండలిలో సభ్యులు డి వెంకట్రావు, వి చక్కరాయచెట్టి, ఎస్ రామకృష్ణయ్య, ఎం సీతారామదాస్ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి ని నిందించారు. ‘ముఖ్యమంత్రి ఒకసారి పొట్టి శ్రీరాములును కలిసి, సవివరంగా మాట్లాడకూడదా?’ అని ప్రశ్నించారు.
దీనికి రాజగోపాలాచారి స్పందిస్తూ.. ‘‘అధ్యక్షా, నేను ఈ నిరాహార దీక్షను అంగీకరించను. నిన్న ప్రధానమంత్రి చెప్పిన విధంగా ముఖ్యమైన తీర్మానాల గురించి ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొని వస్తే, వాటికి లొంగిపోతే, ఇక పార్లమెంటు గాని, చట్ట సభలు గాని పనిచేయజాలవు. మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఇచ్చుట జరగని పని. దీనికి వారు ఒప్పుకుంటే, మద్రాసుపై వారి హక్కులు వదులుకుంటే, మద్రాసు వర్తమాన భవిష్యత్తులను గురించి వారు షరతులు పెట్టకపోతే ఆంధ్రరాష్ట్రానికి నేను అనుకూలుడనే. (శ్రీరాములును కలిసేపని).. నా తరపున వెంకట్రావు గారే చేయవచ్చును. దీనికి నా అనుమతి ఇస్తున్నాను. (ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి) నేను అభ్యంతర పెట్టలేదే. మహాత్మా గాంధీ నిరశన వ్రతంతో (శ్రీరాములు దీక్షను) పోల్చటం తగదు. సాంఘీక లేక అంతరాత్మ సంబంధమైన విషయాలలో వారు ఈ ఉపవాసం చేయు విషయం వేరు. ప్రస్తుతాంశం దేశ పరిపాలనకు సంబంధించిన విషయం.’’
శ్రీరాములు చనిపోయిన తర్వాత 1953 మార్చి 12వ తేదీన కౌన్సిల్‌లో దామెర్ల వెంకటరావు మాట్లాడుతూ.. శ్రీరాములు ప్రాణాలను ముఖ్యమంత్రి కాపాడగలిగి ఉండేవారన్నారు. దీనికి రాజగోపాలాచారి స్పందిస్తూ.. ‘‘ప్రధాని నెహ్రూ చేసిన ప్రకటన శ్రీరాముల చుట్టూ చేరిన కఠోర హృదయులకు నచ్చలేదు. వారు శ్రీరాముల మరణాన్ని నివారించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆ నిరశన వ్రతాన్ని ఒక సాధనంగా చేసుకుని ప్రజాస్వామ్య పద్ధతులను అమలు జరపాలని చూసేవారిమీద ఒత్తిడి తీసుకువచ్చారు. నేను చాలా తప్పులు చేసి ఉండవచ్చును. కానీ, ఈ విషయంలో మాత్రం నేను నిర్దోషిని. ప్రధాని నెహ్రూ కూడా నిర్దోషే.’’
వాస్తవానికి శ్రీరాములును దీక్ష విరమించాలని ప్రకృతి వైద్యుడు రామకృష్ణరాజు దీక్ష 50వ రోజున కోరారని, నెహ్రూ ప్రకటన చేయనున్నారని అనుకుంటున్నారని చెప్పగా.. ‘‘ఏదో ఒక ప్రకటనను ఆధారంగా చేసుకుని నేను నా ప్రాణాలను కాపాడుకోదలచుకోలేదు. (నెహ్రూ ప్రకటన) విషయంలో నాకు నమ్మకం లేదు’’ అని శ్రీరాములు అన్నారని ‘హిస్టరీ ఆఫ్ ది ఆంధ్ర మూవ్‌మెంట్’ గ్రంథ రచయిత జీవీ సుబ్బారావు పేర్కొన్నారు.
శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు.’’
" పొట్టి శ్రీరాములు ప్రశంస పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు" మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డు లో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
Thanks for reading Amarajeevi Sri Potti Sreeramulu Biography - Hunger strike for Separate state of Andhra
No comments:
Post a Comment