ఈ వేసవి భగ భగే
♦️మార్చిలో 45 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత
♦️ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం
♦️విపత్తుల నిర్వహణశాఖ అంచనా
అమరావతి రాష్ట్రంలో ఈ వేసవి నిప్పుల కుంపటిలా ఉండనుంది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలోనే 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతకు చేరువైంది. ఈ నెల మొదట్లోనే వేడి తీవ్రత కనిపిస్తోంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా చేరనున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంటోంది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయని హెచ్చరిస్తోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీరు తెన్నులను పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో ఏకంగా 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు ఉన్నాయి. ఈ ఏడాది వడగాలుల ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
♦️జాగ్రత్తలు తీసుకోవాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బి.ఆర్.అంబేద్కర్ ఒక ప్రకటనలో సూచించారు. దినసరి కూలీలు ఉదయం పూటే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి ఇళ్లకు చేరుకోవాలని, మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రజలు గొడుగులు వినియోగించాలని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డీ హైడ్రేషన్ నుంచి బయటపడేందుకు తగిన మోతాదులో పానీయాలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో తయారు చేసుకున్న లస్సీ, ఓరల్ డీ హైడ్రేషన్ ద్రావణం, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, వంటివి తాగాలని ఆయన సూచించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులపై నాలుగు రోజుల ముందే సూచనలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
* 2021లో మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా మార్చి 31న కురిచేడు, ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ 44 డిగ్రీల నుంచి 45.6 డిగ్రీల మధ్యలో ఉన్నాయి.
Thanks for reading Precautions to be taken by people in the state in the face of rising temperatures.
No comments:
Post a Comment