Parenting | మీ పిల్లలను మీ చేతుల్లో పెడుతున్నాం.. శ్రమ విలువ, సామాజిక బాధ్యతను వివరించండి.
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతోపాటు మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నది.
వేసవి సెలవులను పునాదిగా మార్చండి
చిన్నారులను ఉత్తములుగా తీర్చిదిద్దండి
మానవతా విలువలను తెలుపండి
ఆలోచింపజేస్తున్న కోయంబత్తూర్ టీచర్ల లేఖ
కుటుంబ మాధుర్యాన్ని చూపించండి
స్నేహం, మానవతా విలువల ఔన్నత్యాన్ని తెలుపండి
ఆలోచింపజేస్తున్న కోయంబత్తూర్ ఓ పాఠశాల టీచర్ల లేఖ
తల్లిదండ్రుల్లో జోరుగా చర్చ
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతోపాటు మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నది. 'దాదాపు పది నెలలపాటు విద్యాబుద్ధులు చెప్పాం. అయితే రెండు నెలల వేసవి సెలవుల సందర్భంగా మీ పిల్లలను మళ్లీ మీ చేతుల్లో పెడుతున్నాం. ఇక వారి బాధ్యత మీదే. ఈ సమయంలో పిల్లలకు సామాజిక బాధ్యతను వివరించండి. కుటుంబ మాధుర్యాన్ని చూపించండి. స్నేహం, మానవతా విలువల ఔనత్యాన్ని తెలియజేయండి. ఈ 60 రోజులూ మీపిల్లల ఉన్నతికి ఒక పునాదిగా మార్చండి' అంటూ పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు వారి బాధ్యతలను సైతం ప్రస్తావిస్తూ రాసిన ఆ లేఖ, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
వేసవి సెలవులో నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో పాటు, మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నది. ఈ సందర్భంగా ఈ 60 రోజులు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు వారి బాధ్యతలను సైతం పొందు పరుస్తూ లేఖ రాశారు. ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రతలపై పలు సూచనలు చేశారు.
మనం వినియోగించే వస్తువులు ఎలా తయారవుతాయన్న దానిపై అవగాహన కల్పించండి. వారు తిన్న పాత్రలను వారితోనే శుభ్రం చేయించండి. వారి దుస్తులను వారితోనే శుభ్రం చేయించండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు శ్రమ గొప్పతనం తెలుస్తుంది. అలాగే మన పనులు మనం చేసుకోవడం తప్పుకాదు అని వారు గ్రహిస్తారు.
ఇండ్లలో ఖాళీ స్థలం ఉంటే మొక్కలను నాటించి వాటికి నీళ్లు పోయించి వాటిని సంరక్షించే బాధ్యతలను అప్పగించండి. దీంతో పిల్లలకు తోట పనులు అలవాటు అవుతాయి. అలాగే వారికి ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతపై సైతం అవగాహన ఏర్పడుతుంది. మొక్కల ప్రాధాన్యతను కచ్చితంగా పిల్లలకు తెలియజేయండి. ఇది భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం కాకుండా కాపాడేందుకు ఒక మార్గాన్ని రూపొందించిన వారవుతారు.
పిల్లలను ఇంటి వద్దే ఉంచకుండా వారికి సెలవుల్లో చిన్నచిన్న పనులు అప్పగించండి. గ్రామాల్లో ఉన్న అంగడికో, రైతుబజార్‌కో పంపించండి. దీంతో సరుకులను ఎలా కొనుగోలు చేయాలి? తాజా వాటిని ఎలా గుర్తించాలి? వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంపై కొంత స్పష్టత ఏర్పడుతుంది.
సెలవుల్లో ప్రతి రోజూ పిల్లలతో కలిసి భోజనం చేయండి. ఆ సమయంలో ఆహారం ఎలా సమకూరుతుంది? రైతులు శ్రమ ఎలా ఉంటుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించండి. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించాలని, దుబారా చేయవద్దని తెలియజేయండి.
ప్రతిరోజు ఐదు కొత్త పదాలను నేర్చుకునేలా ప్రోత్సహించండి. మాతృభాషతోపాటు ఆంగ్లం, హిందీ ఇతర భాషలకు సంబంధించినవి ఏవైనా పదాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి. వీలైనంత వరకు పుస్తక పఠనం అలవాటు చేయించండి. ఇది భవిష్యత్తులో వారికి ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకోవాలని చెప్పండి. అందుకు సహకరించండి. ఇలా చేయడం వల్ల ఇరుగు పొరుగు వారితో సంబంధాలు, స్నేహభావం పెరుగుతుంది. ఈ పరిచయాల వల్ల సామాజిక బాధ్యత, అవసరాలు, సమాజంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై పిల్లలకు కొంత అవగాహన కలుగుతుంది.
వీలుంటే జంతు శాలలకు పిల్లలను తీసుకువెళ్లి చూపించండి. జంతువులపై అవగాహన కల్పించండి. పెంపుడు జంతువుల ప్రాధాన్యతను వివరించండి. జంతుప్రేమతో పాటు, మానవీయ సంబంధాలు, పరోపకారం వంటి ఉత్తమ అంశాలపై అవగాహన కల్పించండి. వీలైతే పిల్లలను దగ్గర కూర్చొబెట్టుకొని జాతీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాట అంశాలను వివరించే ప్రయత్నం చేయండి. రెండు నెలల పాటు, పిల్లలను సెలవుల పేరిట ఇంట్లో కుక్కివేయకుండా, వారిలో ఉత్తమ లక్షణాలు నాటుకునేలా ప్రయత్నం చేయండి.
కుటుంబ నేపథ్యం, చరిత్ర పిల్లలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ స్థాయి కుటుంబం నుంచి వచ్చింది? పూర్వీకులు ఏ వృత్తులు చేశారు? ఎలా కుటుంబాలను వృద్ధిలోకి తెచ్చారు. అందుకు గాను వారు ఎంతగా శ్రమించారు. తల్లిదండ్రులుగా మీ అనుభవాలు ఎలాంటివి? ఎలా ఎదిగారు అన్న వివరాలను పిల్లలతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు తమ కుటుంబాలు, వారి వారసత్వం, వృత్తి తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యల వద్దకు పంపించండి. కొద్దిరోజులు వారితో గడిపితే పెద్దవారిపై ప్రేమాభిమానాలు పెరుగుతాయి. భవిష్యత్తులో మీపై మీ పిల్లలు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలన్న విషయమై వారికి ఒక అవగాహన వస్తుంది. అలాగే పిల్లల అనుభవం, వారు బోధించే నీతి కథలు పిల్లల దృక్పథాన్ని మారుస్తాయి. పెద్దవాళ్ల దగ్గరకి పిల్లలను పంపినప్పుడే కుటుంబ మాధుర్యం, కుటుంబ అవసరంపై వారికి అవగాహన వస్తుంది.
సెలవుల్లో చిన్నమ్మలు, చిన్నాన్నలు, అత్తమ్మలు, వదినలు ఇలా అందరిని పిల్లలు కలిసేలా చూడండి. ఇది కుటుంబ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మారిన ప్రస్తుత తరుణంలో పిల్లలకు అంకుల్, ఆంటీ, బ్రదర్, సిస్టర్ అనే పదాలు తప్పా మిగితావి తెలియడం లేదు. ఈ పద్ధతిని మార్చండి. పిల్లలకు చిన్నమ్మ, చిన్నాన్న, మేనత్త, మేనమామ, అత్తమ్మ, మామయ్య, అన్న, తమ్ముడు, వదిన, మరిది, బావ అనే వరుసలు ఏంటీ? వాటి ప్రాధాన్యత ఏంటీ? ఏ వరస అయిన వారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలను సైతం వివరించండి. అప్పుడే సంబంధాలు మెరుగుపడుతాయి.
వీలైతే మీరు పనిచేసే చోటుకు పిల్లలను తీసుకెళ్లండి. మీ పనితీరు, మీ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయాన్ని వారు స్వయంగా చూసేలా చేయండి. దీంతో పిల్లల బాధ్యతల కోసం తల్లిదండ్రులు ఎంతగా శ్రమిస్తున్నారు, ఎంతగా తపిస్తున్నారు అన్న విషయం వారికి తెలిసివస్తుంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధం మరింతగా దృఢ పడుతుంది. కష్టం విలువను సైతం ఈ సమయంలో పిల్లలు తెలుసుకుంటారు.
ఎండలు తీవ్రంగా ఉన్నాయని, బయటకు వెళ్లకుండా పిల్లలను ఇంట్లోనే కూర్చొబెట్టి, సెల్‌ఫోన్ గేమ్స్, ఇంటర్నెట్ గేమ్స్‌కు అలవాటు పడేలా చేయకండి. పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లమని ప్రోత్సహించండి. ఉదయం, సాయంత్రం కచ్చితంగా వారికి నచ్చిన ఆటలను ఆరుబయట ఆడేలా చూడండి. దీంతో పిల్లలకు శారీరక దృఢత్వంతో పాటు, మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. ప్రమాదం లేని చోట ఈత కొట్టేందుకు పిల్లలను ప్రోత్సహించండి. అలాగే ఇతర శారీరక శ్రమను కలిగించే ఆటలు ఆడించండి. ఇంట్లోనే ఉంచి టీవీ చూపిస్తే వారిలో బద్దకం పెరిగిపోవడంతో పాటు అనారోగ్యం వస్తుంది. క్రీడల వల్ల వారిలో జయాపజయాలను సైతం ఎదుర్కొనే శక్తి వస్తుంది.
సలహాలు, సూచనలు ఇవ్వాలి
వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రానున్న రెండు నెలలపాటు పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వడం చాలా మంచి విషయం. కేరళ రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలతో లేఖలు రూపొందించి అందజేయడం గొప్ప పరిణామం. వేసవి సెలవుల్లో పిల్లలకు శ్రమ విలువతో పాటు, సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పరిసరాల అధ్యయనంపై వారికి అభిరుచి కలిగేలా చేయాలి. కేరళలో ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాన్ని మన వద్ద కూడా చేయాల్సిన అవసరం ఉంది.
శ్రమ విలువను పిల్లలకు నేర్పాలి
సెలవులంటే పిల్లలను ఇంట్లో పెట్టి నిర్బంధించడం, ఎండకు తిరగకుండా చేయడం అన్న భావనే ఉంది. అయితే వేసవి సెలవుల్లో పిల్లలకు ఒక విశాల పాఠశాలను పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలకు సెలవుల్లో ప్రతి అంశంపై అవగాహన కల్పించాలి. కుటుంబం గొప్పతనాన్ని ముందుగా పిల్లలకు తెలియజేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఎంత గొప్పవన్న విషయం వివరించాలి. శ్రమ విలువను తెలియజేయాలి. ప్రపంచం అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్న భ్రమను పిల్లల నుంచి తొలగించాలి. ప్రపంచం అంటే మానవ సమూహం అన్న విషయం వారికి అర్థం చేయించాలి. ఈ వేసవి సెలవులను మార్చేందుకు కోయంబత్తూరు టీచర్లు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఇక్కడ సైతం అలాంటి ప్రయత్నాలు జరగాలి.
Thanks for reading parenting | Placing your children in your hands.. Explain the value of labor and social responsibility
No comments:
Post a Comment