Quiz: చంద్రయాన్-3 'మహాక్విజ్'లో పాల్గొనండి.. రూ.లక్ష గెలుచుకోండి!
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ దేశం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇలా అంతరిక్ష పరిశోధనలో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ప్రయాణానికి గౌరవ సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రయాన్-3 'మహాక్విజ్' పేరుతో ఓ ఆన్‌లైన్ 'క్విజ్'ను ప్రారంభించింది. ఇందులో పాల్గొన్న వారిలో లక్కీ విజేతకు రూ.లక్ష అందజేస్తామని తెలిపింది. దీంతోపాటు వందల మందిని విజేతలుగా ఎంపిక చేసి.. మొత్తంగా రూ.6లక్షలకు పైగా నగదును అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
లక్కీ విజేతకు రూ.లక్ష..
ఇస్రో (ISRO) భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం (MyGov) రూపొందించిన ఈ పోటీలో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను https://isroquiz.mygov.in రూపొందించింది. ఇందులో పాల్గొని క్విజ్ పూర్తిచేసిన వారిలో లక్కీ విజేతలను ఎంపిక చేస్తారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఒక విజేతకు రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తారు.
రెండో విజేతకు రూ.75వేలు, మూడో విజేతకు రూ.50వేలు ఇస్తారు.
ఉత్తమ ప్రతిభ కనపరిచిన తదుపరి 100 మందికి రూ.2వేల చొప్పున అందిస్తారు.
వీరితోపాటు మరో 200 మందికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదును అందిస్తారు.
ఎలా పాల్గొనాలి..?
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన https://isroquiz.mygov.in వెబ్‌సైట్‌లో పోటీకి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ లింక్ ద్వారా లేదా mygov.in/chandrayaan3 అని గూగుల్ టైప్ చేస్తే.. సదరు లింక్ ఓపెన్ అవుతుంది. 'క్విజ్' ఎలా ఉంటుంది..?, నగదు బహుమతి ఎంత..? నియమ నిబంధనలు ఏంటి..? అనే విషయాలను చదివిన తర్వాత అక్కడే ఉన్న 'పార్టిసిపేట్ బటన్'ను నొక్కాలి. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, పుట్టిన రోజు, రాష్ట్రం, జిల్లా వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. అనంతరం ప్రొసీడ్ బటన్ నొక్కితే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత 'క్విజ్' ప్రశ్నలు ఒక్కొకటి వస్తుంటాయి.
10 ప్రశ్నలు.. 300 సెకన్లు..
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రయాణానికి సంబంధించి ఈ క్విజ్‌లో 10 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 300 సెకన్లలో వీటిని పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు ప్రశ్నలు వస్తాయి. ISRO, MyGov సంయుక్తంగా చేపడుతోన్న ఈ ఆన్‌లైన్ పోటీలో ఈ రెండు విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, వారి కుటుంబీకులు పాల్గొనేందుకు అనర్హులు. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎప్పటివరకు ఇది కొనసాగుతుంది, తుది విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. తదుపరి అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండాలని సూచించింది. ఈ క్విజ్ పూర్తిచేసిన వారికి పోటీలో పాల్గొన్నట్లు ఓ సర్టిఫికేట్ లింకును మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Thanks for reading Quiz: Participate in Chandrayaan-3 'MahaQuiz'... Win Rs.Lakh!
No comments:
Post a Comment