Andhra Pradesh govt. launches ‘Mana Mitra’ - Governance, 161 civil services to be delivered through WhatsApp
Andhra News: 95523 00009 తో 161 సేవలుప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ పాలనకు శ్రీకారం చుట్టింది. ‘మన మిత్ర’ పేరుతో దీన్ని తీసుకొచ్చింది.
రాష్ట్రంలో ఇక వాట్సప్ పాలన
ప్రజల చేతుల్లో ‘మన మిత్ర’
సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల టికెట్లు
సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ పాలనకు శ్రీకారం చుట్టింది. ‘మన మిత్ర’ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అధికారిక వాట్సప్ నంబరు 95523 00009ను ప్రభుత్వం కేటాయించింది. ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. వరదలు, అత్యవసర, విద్యుత్తు ఉపకేంద్రాల మరమ్మతుల్లాంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు. ఈ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్కు) ఉంది. ఈ నంబరు వాట్సప్‌తో తొలివిడతలో విద్యుత్తు, దేవాదాయ, రెవెన్యూ, పురపాలకశాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ సేవలతోపాటు వినతులు స్వీకరించేందుకు వీలుంటుంది. ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా తీసుకురాలేదు. ఇది అమలుచేస్తున్న తొలి రాష్ట్రం మనదే. ప్రభుత్వపరంగానూ ఎక్కడా లేదు. ‘మనమిత్ర’ ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం. మాది ప్రజాప్రభుత్వం. ఈ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాకూడదనే ప్రశ్న ఉత్పన్నమైంది. కుల ధ్రువీకరణ పత్రం ఎన్నిసార్లు తీసుకోవాలి? ఆదాయ ధ్రువపత్రం కోసం మళ్లీ అధికారుల వద్దకు ఎందుకు వెళ్లాలని పాదయాత్రలో నన్ను అడిగారు. గత ఐదేళ్లలో సర్టిఫికెట్లు రానివ్వకుండా చేశారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన తెదేపా అభ్యర్థికి ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. వ్యవస్థలో లోపాలను సరిచేయాలని భావించాను. ధ్రువపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఇది మొదలైంది’’ అని తెలిపారు.
రెండు విడతల్లో 520 సేవలు
‘‘భవిష్యత్తులో మరింత మెరుగ్గా ‘మన మిత్ర’ అమలుచేస్తాం. వచ్చే ఆరు నెలల్లో గణనీయమైన మార్పులను ప్రజలే చూస్తారు. రెండో విడతలో 360 పౌరసేవలను తీసుకువస్తాం. మొత్తం 520కి పైగా సేవలు వాట్సప్ ద్వారా అందించేందుకు కృషిచేస్తున్నాం. రియల్ టైమ్‌లోనే అన్నీ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షల హాల్‌టికెట్లు సైతం విద్యార్థులు వాట్సప్ ద్వారా పొందొచ్చు. ఇకపై జారీచేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తాం. దీన్ని స్కాన్ చేస్తే ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు ఆ లింకు వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. మెటాతో ఒప్పందం జరిగిన మూడు నెలల 9 రోజుల్లోనే దీన్ని ప్రారంభించాం. రెండోదశలో ఏఐ బాట్, వాయిస్ ద్వారానూ సేవలు అందిస్తాం. మలిదశ సేవలకు అనుగుణంగా ప్రభుత్వం చట్ట సవరణలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగు, ఆంగ్ల భాషల్లో సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఉంటాయి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్యా దేవనాథన్, వాట్సప్ డైరెక్టర్, ఇండియా హెడ్ రవి గార్గ్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఆర్టీజీఎస్ సీఈఓ దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇలా పని చేస్తుంది..
మొదటి విడతలో విద్యుత్తు, ఏపీఎస్‌ఆర్టీసీ, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖలతోపాటు వినతులు ఇచ్చేందుకు సదుపాయాన్ని కల్పించారు.
వాట్సప్‌లో ఈ నంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపించాలి.
ఆ తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది. ‘సేవను ఎంచుకోండి’ అని కనిపిస్తుంది.
సేవను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలు కనిపిస్తాయి. అవసరమైన సేవను ఎంచుకోవాలి.
ఉదాహరణకు రెవెన్యూ శాఖను ఎంచుకుంటే ఓబీసీ, వివాహ ధ్రువీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, మరెన్నో సేవలు పొందడానికి క్లిక్ చేయండి అని వస్తుంది.
ఆ సేవల్లో ఈడబ్ల్యూఎస్ ఎంపిక చేసుకుంటే ఆధార్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి.
ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు.
ధ్రువపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తు పరిస్థితిని తెలుసుకోవచ్చు.
విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను చెల్లించొచ్చు.
రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల రికార్డులు, సర్టిఫికెట్లు పొందొచ్చు.
ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, రద్దు, ప్రయాణం రిమైండర్ సేవలు అందుతాయి.
Thanks for reading Andhra Pradesh govt. launches ‘Mana Mitra’ - Governance, 161 civil services to be delivered through WhatsApp
No comments:
Post a Comment