మీరెంత బలవంతులు? ఈ పరీక్షలు పరీక్షించి చూడండి.
మీరెంత బలవంతులు? ఎప్పుడైనా తెలుసుకోవటానికి ప్రయత్నించారా? ఎంత బరువెత్తితే అంత బలవంతులమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ పరీక్ష అంత కచ్చితమైంది కాదు.
చురుకుగా, గాయాల పాలు కాకుండా ఎంత బాగా కదులుతున్నారనేది నిజమైన బలాన్ని పట్టి చూపుతుంది. దీన్ని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు తోడ్పడతాయి. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.
పిడికిలి పట్టు
ఉక్కు పిడికిలి అని మాట వరసకే అనలేదు. పిడికిలి పట్టు బలంగా ఉండటం చాలా పనులకు తోడ్పడుతుంది. సరకులు మోసుకురావటం, బరువైన వస్తువులను జరపటం, చేత్తో పట్టుకునే పరికరాలతో పనిచేయటం వంటి పనులకు ఇది అత్యవసరం. హ్యాండ్ డైనమోమీటర్ సాయంతో పిడికిలి పట్టును పరీక్షించుకోవచ్చు. చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండే దీన్ని మధ్యలో నొక్కితే పిడికిలి బలమెంతో బయటపడుతుంది.
అరచేయి పైకి ఉండేలా మణికట్టును 90 డిగ్రీల కోణంలో వంచాలి.
డైనమోమీటర్‌ను చేత్తో పట్టుకొని, మధ్యభాగాన్ని వీలైనంత వరకు నొక్కాలి.
రీడింగును గుర్తించి, పిడికిలి వదిలిపెట్టాలి.
మరో రెండుసార్లు ఇలాగే చేయాలి. మూడు రీడింగుల సగటును లెక్కించాలి.
అనంతరం మరో చేత్తో డైనమోమీటర్‌ను నొక్కి, సగటు రీడింగ్ నమోదు చేసుకోవాలి.
నార్మల్ పిడికిలి పట్టు వయసు, లింగ భేదాన్ని బట్టి ఆధారపడుతుంది. పురుషుల్లో- 20-29 ఏళ్ల వయసులో 46 కిలోలుంటే.. 60-69 ఏళ్ల వయసులో 30 కిలోలుంటుంది. ఆడవారిలో- 20-29 ఏళ్ల వయసులో 29 కిలోలు కాగా 60-69 ఏళ్ల వయసులో 23.5 కిలోలు ఉంటుంది. వీటిని బట్టి పిడికిలి బలమెంతో ఎవరికివారే అంచనా వేసుకోవచ్చు.
చేత్తో వాహనాలు తుడవటం, టెన్సిస్ లేదా స్ట్రెస్ బంతిని నొక్కటం, బట్టలు ఉతికి పిండటం వంటి పనులతో పిడికిలి పట్టును పెంచుకోవచ్చు.
పుషప్ సామర్థ్యం
పుషప్‌లతో ఛాతీ, చేతులు, భుజాలు, కడుపు, వీపు కండరాలన్నీ ఒకేసారి పనిచేస్తాయి. శరీర పైభాగం బలంగా ఉంటే రోజువారీ పనులు సాఫీగా చేసుకోవచు. భంగిమ, కదలికలూ మెరుగవుతాయి. ఒకసారి ఎన్ని పుషప్‌లు తీయగలరనేది శరీర పైభాగం బలాన్ని, కండరాల సామర్థ్యాన్ని పట్టి చూపుతుంది. కానీ ఎంత బాగా పుషప్‌లు తీస్తున్నారనేదీ ముఖ్యమే. నేలకు చేతులు ఆనించి పుషప్స్ తీస్తే అసలు శక్తి బయటపడుతుంది. చేతులను చాచి, సరిగ్గా భుజాల కింద అరచేతులను నేలకు తాకించాలి. పాదాలను దగ్గరగా లేదా 12 అంగుళాల దూరంలో ఉంచి, వేళ్లను నేలకు తాకించాలి. ఈ స్థితిలో శరీర బరువు మొత్తం అరచేయి, పాదాల వేళ్ల మీదే ఉంటుంది. వెన్ను తిన్నగా ఉండాలి. బరువు వేళ్ల మీద సమానంగా పడాలి. కిందికి చూస్తూ ఛాతీ నేలకు తాకించి, ఒక్క ఉదుటున శరీరాన్ని ఛాతీని పైకి లేవాలి. రెండు సెకండ్ల పాటు కిందికి, ఒక సెకండు సేపు పైకి లేచేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తులు ఒకసారి 15-20 పుషప్స్ తీస్తే బాగానే చేస్తున్నారని అనుకోవచ్చు.
కాలి వేళ్ల మీద బలాన్ని మోపి, పుషప్స్ తీయటం సాధ్యం కాకపోతే మోకాళ్లను నేలకు ఆనించి లేదా గోడకు చేతులను ఆనించి అయినా చేయొచ్చు. బలం పెరుగుతున్నకొద్దీ పుషప్స్ సంఖ్య పెంచుకుంటూ రావాలి.
కింద కూర్చొని లేవటం
నేల మీద కూర్చొని, సునాయాసంగా పైకి లేవటమూ బలానికి పరీక్షే. ఇది శరీర నియంత్రణ, సమన్వయ సామర్థ్యంతో పాటు కాళ్లు, వీపు, కడుపు కండరాల బలాన్నీ పట్టి చూపుతుంది. ముందుగా కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవాలి. తర్వాత పైకి లేవాలి. (పడిపోతే పట్టుకోవటానికి పక్కన ఎవరైనా ఉండేలా చూసుకోవటం మంచిది). మార్కులను బట్టి దీని సామర్థ్యాన్ని గుర్తించొచ్చు. మొత్తమ్మీద 10 మార్కులు సాధించటం లక్ష్యంగా పెట్టుకోవాలి. దేని సాయం తీసుకోకుండా సునాయాసంగా కూర్చొని, పైకి లేవగలిగితే పదికి పది సాధించినట్టే. ఒక చేయిని, మోకాళ్లను నేలకు తాకించటం, ముంజేయి సాయం తీసుకోవటం, ఒక చేతిని మోకాలు లేదా తొడ మీద పెట్టుకోవటం, పక్కకు తూలటం వంటివి గమనిస్తే ఒక మార్కును తీసేసుకోవాలి. ఉదాహరణకు- ఒక చేతి సాయం తీసుకున్నా, మోకాళ్లను నేలకు ఆనించినా ఒక మార్కు.. రెండు చేతులను, రెండు మోకాళ్లను నేలకు ఆనించి లేస్తే 4 మార్కులు తీసేయాలి.
బింగీలు తీయటం, మెట్లు ఎక్కటం వంటివేవైనా కాళ్ల బలాన్ని పెంపొందిస్తాయి. కదలికలను మెరుగు పరుస్తాయి. యోగా కూడా శరీరం తూలిపోకుండా కాపాడుతుంది. కుర్చీలో కూర్చొని లేవటం ద్వారానూ నడుం, కాళ్లను బలోపేతం చేసుకోవచ్చు.
Thanks for reading How strong are you? Try these tests.
No comments:
Post a Comment