Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 7, 2020

Physical attendance is better than online education


ఆన్‌లైన్‌ విద్యావిధానం కన్నా భౌతిక హాజరే శ్రేయస్కరం

Physical attendance is better than online education


విశ్లేషణ

కరోనా మహమ్మారి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీని నేపథ్యంలో విద్యా సంస్థలను తెరుస్తున్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యం,భవిష్యత్‌ గురించి నిశితంగా ఆలోచించాల్సి ఉంది. పాశ్చాత్య దేశాల్లోనూ ముందు ఆన్‌లైన్‌ విద్యావిధానమే ప్రవేశపెట్టినా తరువాత అన్నిచోట్ల స్కూళ్లు తెరిచారు. జర్మనీ, జపాన్‌లలో రోజు విడిచి రోజు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో డాక్టర్లు, విద్యావేత్తలు, విశ్లేషకులు, కమిటీలను ఏర్పరచి, కొన్ని తరగతుల వారికే పరిమితం చేయడమా? 50% విద్యార్థులతో హైబ్రిడ్‌ పద్ధతా? లేకపోతే సింగపూర్‌లో వలే మూడు షిఫ్టుల పద్ధతా? అని త్వరగా నిర్ణయం తీసుకుని పాఠశాలలను ప్రారంభిస్తే కొన్ని కోట్లమంది విద్యార్థులకు మేలు చేసిన వాళ్లమవుతాం.

సమాజమంతా కరోనా ప్రళయ సమయంలో విపరీతంగా భయాందోళనకు గురై ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోందన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి పది రెట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఆందోళన చెందటం సహజం. కాబట్టి, ఈ తరుణంలో విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్‌ గురించి నిశితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ సమస్య దేశవ్యాప్తంగా సుమారు 15-20 కోట్ల మంది విద్యార్థులకు సంబంధించినది.


విద్యార్థుల్లో విపరీత ధోరణులు

విద్యా సంస్థలు పునఃప్రారంభం కాకుండా ఇంకా నాలుగైదు నెలలపాటు పొడిగిస్తే.. విద్యార్థులు కేవలం విద్యాపరంగా మాత్రమే నష్టపోవడం కాకుండా వారి ఆరోగ్యపరంగాను, ఆలోచనల ధోరణి, క్రమశిక్షణ మొత్తం పక్కదారి పట్టే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు విద్యాబోధన కొంతవరకు ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పటికీ విద్యార్థుల వ్యక్తిగతమైన ఇతర అంశాలు.. అంటే పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మంచి బట్టలు వేసుకోవడం లాంటివి పూర్తిగా మరచిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆటలు, పాటలు వంటివి కూడా లేకపోవడం వలన శారీరక శ్రమ, కదలిక లేకపోవడం వలన కూడా విద్యార్థుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. అన్నింటికీ మించి మూసి ఉంచిన గదులలో ఎవరైనా ఎక్కువసేపు గడపడం వలన, ఎటువంటి వ్యాయామాలు, పనులు చేయకపోవడం వలన కరోనా బారిన పడితే వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. దీనికితోడు అట్టడుగు వర్గాల పిల్లలు స్కూలుకు వెళ్లకపోవడం వలన స్కూల్లో లభించే ఆహార సదుపాయాన్ని వారు కోల్పోతున్నారు.


విద్యాసంస్థలు తెరిస్తే...

ప్రస్తుతం విద్యా సంస్థలు తెరిస్తే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాలి. విద్యార్థులు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు కరోనా ప్రభావం ఉండచ్చు. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు సమూహంగా లేకుండా దూరం పాటిస్తూ, వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుని విద్యా సంస్థలు నిర్వహిస్తే చాలా రకాలుగా మేలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. విద్యాలయాలు ఒకసారి తెరిస్తే పొద్దున్నే లేవటం కానీ, ఆహార నియమాలు కానీ, చదువు నేర్చుకునే విధానంతో పాటు ఉపాధ్యాయుల సలహాలు పాటించటం వంటివన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్షల వలన కానీ, సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా అన్ని యూనివర్సిటీల్లో నిర్వహించిన ఫైనల్‌ పరీక్షల్లోకానీ, అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో కానీ ఎక్కడా తీవ్రమైన ఇబ్బందులు కలగలేదనే విషయం అందరికీ తెలిసిందే.


విదేశాల్లో ప్రస్తుత పరిస్థితి

సింగపూర్, న్యూజిలాండ్, డెన్మార్క్, అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా ముందు ఆన్‌లైన్‌ విద్యావిధానమే ప్రవేశపెట్టినా దాని వలన పాక్షిక ఫలితాలు మాత్రమే కలుగుతున్నాయని మేధావులు విశ్లేషించిన మీదట అన్నిచోట్ల స్కూళ్లు తెరిచారన్న విషయం విదితమే. వారు విద్యార్థులను తీసుకుని వచ్చేటప్పడు బస్సుల్లోకానీ, విద్యాలయాల్లో కానీ తగినంత జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటివి తప్పనిసరి చేశారు. వీటన్నింటితో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. అమెరికాలో అయితే ప్రస్తుతం 85% పాఠశాలలు తెరిచి ఉంచారు. కేవలం ఒక ఆరు రాష్ట్రాలలో మాత్రమే పాఠశాలలు తెరవలేదు. టెక్సాస్, ఐవా లాంటి అతి పెద్ద రాష్ట్రాలలో మొత్తం పాఠశాలలు తెరిచారు.


అమెరికాలో 5 నుంచి 17 సంవత్సరాల పిల్లలు ఇప్పటివరకు 2,75,000 మంది కరోనా బారిన పడగా కేవలం 2% మంది పిల్లలు మాత్రమే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వాల్సి వచ్చిందని, మిగిలిన వారిలో లక్షణాలు కనిపించలేదని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పెడియాట్రిక్స్‌ సంస్థ ధృవీకరించింది. డెన్మార్క్‌లో అయితే ప్రతి 12 మంది విద్యార్థులకు కలిపి ఒక ప్రొటెక్టివ్‌ బబుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ బబుల్‌ ఉన్న 12 మంది విద్యార్థులు మరొక బబుల్‌ ఉన్న విద్యార్థులతో కలిసి తిరగడం కానీ, భోజనం చేయటం, కలిసి ఆడుకోవడం వంటివి చేయరాదు. జర్మనీ, జపాన్‌ దేశాలలో అయితే రోజు విడిచి రోజు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఒక రోజు స్కూల్‌కు వస్తే, మరో రోజు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలే మనదేశంలో కూడా తీసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు కనిపించవు.


ప్రభుత్వ ఆలోచనా విధానాలు

ఈ సందర్భంలో ప్రభుత్వం వారి ఒక విచిత్రమైన ఆలోచనను చెప్పవలసిన విషయం ఎంతైనా ఉంది. సినిమా హాళ్లు తెరవడానికి ఈ నెల అక్టోబర్‌ 15 నుంచి అనుమతులు ఇస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే తెరిచిన మార్కెట్‌లలో కూడా ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించడం కూడా ప్రమాదకరమే. సినిమా హాళ్లంటే తలుపులు మూసి ఉంచడంతో పాటు ఎయిర్‌ కండీషన్‌ వాతావరణం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సూర్యరశ్మిగానీ, గాలి గానీ వచ్చే అవకాశం లేదు. కరోనా వ్యాపించడానికి అంతకంటే భయంకరమైన స్థలం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. సినిమా హాళ్లను అనుమతించినప్పుడు.. హాయిగా గాలి, సూర్యరశ్మి, ఆటస్థలాలు ఉన్న స్కూళ్లను తెరవకపోవడం సహేతుకంగా అనిపించదు. అయితే తల్లిదండ్రులకు ఈ విషయంలో కొంత భయాందోళన ఉండటం సహజం. వీటన్నింటిని ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు, విద్యా సంస్థలు నివృత్తి చేసి తగిన జాగ్రత్తలు పాటించి విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సన్మార్గంలో నడిచే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.


విద్యాసంస్థలు పాటించాల్సిన జాగ్రత్తలు

విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించిన తర్వాత విద్యార్థులందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాలంటే ప్రస్తుతమున్న తరగతి గదుల సంఖ్యను రెట్టింపు చేయాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. అందువలన తరగతి గదులకు 50% మంది విద్యార్థులను మాత్రమే షిఫ్ట్‌ పద్ధతిలో అనుమతించాలి. మిగిలిన వారికి ఆన్‌లైన్‌లో బోధించాలి. అందులోను ఏయే కోర్సులను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించగలమో వాటిని మాత్రమే ఆన్‌లైన్‌లో బోధించాలి. కొద్దిపాటి కష్టంతో కూడుకున్న కోర్సులను మాత్రం తరగతి గదిలో బోధించేలా ప్లాన్‌ చేసుకోవాలి.


ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు మాత్రం సగం మంది విద్యార్థులను ల్యాబ్‌లకు అనుమతించి, మిగి లిన సగం మంది విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలను బోధించాలి. ఇలా చేసినట్లైతే భౌతిక దూరం పాటిస్తూనే వారికి కావలసిన విద్యాబుద్ధులను నేర్పించవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని సమస్యలూ తలెత్తుతాయి. ఎవరైనా ఒక విద్యార్థి కరోనా బారిన పడితే పిల్లల నుంచి వారి ఇంట్లో ఉండే పెద్దవారికి సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి. వీటితో పాటు ప్రతి విద్యాలయానికి ఒక డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలి. వీరి ద్వారా విద్యార్థికి కొద్దిపాటి లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించడానికి వీలు కలుగుతుంది. పైగా తరగతి గదిలో షిఫ్ట్‌ల ప్రకారం తరగతి గదులను నిర్వహిస్తాం కాబట్టి కొద్దిపాటి కష్టమైనా ప్రతిరోజు శానిటైజేషన్‌ చేయాలి.


భౌతిక హాజరే శ్రేయస్కరం

ఆన్‌లైన్‌ విద్యా విధానం వలన పిల్లలు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా లక్ష్యాలు సాధించలేకపోతున్నారని, అంతేకాకుండా మానసిక ఆరోగ్యం, అందరితో కలివిడిగా ఉండటం, సామాజిక స్పృహ వంటి వాటిని కూడా పొందలేకపోతున్నారని అమెరికాలోని సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) ఆరోగ్య సంస్థ, అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పెడియాట్రిక్స్‌ సంస్థలు తమ నివేదికల్లో తెలిపాయి. అందువలన విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను బోధించకుండా, తరగతి గదులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సంస్థలు రెకమెండ్‌ చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇప్పటికే పాఠశాలల్ని ప్రారంభించాయి. మన దేశంలో ఇంకా ప్రారంభించడానికి ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయి. ఈ నిర్ణయాలన్నీ ఒకరో, ఇద్దరో ఉన్నత స్థాయి ఆఫీసర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, జాతీయ స్థాయిలో ప్రముఖ డాక్టర్లు, విద్యావేత్తలు, విశ్లేషకులతో కమిటీలను ఏర్పరచి సరైన నిర్ణయాలు అంటే కొన్ని తరగతులు వారికే పరిమితం చేయడమా? 50% విద్యార్థులతో హైబ్రిడ్‌ పద్ధ్దతా? లేకపోతే సింగపూర్‌లో వలే మూడు షిఫ్టుల పద్ధతా? లేక మరేదైనా పద్ధతా అనే నిర్ణయం త్వరగా తీసుకుని పాఠశాలలను ప్రారంభిస్తే కొన్ని కోట్లమంది విద్యార్థులకు మేలు చేసిన వాళ్లం అవుతాము.

డాక్టర్‌ లావు రత్తయ్య

వ్యాసకర్త విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌

Thanks for reading Physical attendance is better than online education

No comments:

Post a Comment