Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గుతుండగా.. రికవరీల పెరుగుదల అధికంగా కొనసాగుతోంది. కరోనా అనంతరం కలవర పెడుతున్న బ్లాక్ ఫంగస్ ఔషధాలపై జీఎస్టీని కేంద్రం ఎత్తివేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా పలు రాష్ట్రాలు వైద్య సదుపాయాల మెరుగుదలపై దృష్టిపెట్టాయి. కశ్మీర్‌లో కేవలం 17 రోజుల్లోనే డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ కష్టకాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..
> కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి రోజురోజుకీ తగ్గుతోంది. దేశంలో నిన్న 19.20లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 84,332మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39శాతానికి తగ్గింది. రికవరీ రేటు 95.07శాతానికి పెరిగింది. వరుసగా 30వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్యే భారీగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10.8లక్షలకు దిగొచ్చాయి.
> కరోనా ఔషధాలు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే అంఫోటెరిసిన్-బి, టొసిలిజుమాబ్ ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. రెమ్‌డెసివిర్‌పై 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించగా.. అంబులెన్స్ సేవలపై జీఎస్టీని 28 నుంచి 12శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. టీకాలపై మాత్రం 5శాతం జీఎస్టీని యథాతథంగా ఉంచారు. కొవిడ్ ఔషధాలు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మాస్కులపై 12శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. కొత్త ధరలు సెప్టెంబర్ నెలాఖరు వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
> సింగరేణిలో ఆదివారం నుంచి మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. 10 రోజుల్లోగా 29వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఇప్పటికే 16వేల మందికి తొలిడోసు ఇచ్చినట్టు తెలిపారు. సింగరేణి ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాళ్లలో టీకా పంపిణీ జరగుతుందని ఆయన తెలిపారు.
> కేంద్రపాలితప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 500 పడకల కొవిడ్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. శ్రీనగర్‌లో పీఎం కేర్స్ నిధులతో కేవలం 17 రోజుల వ్యవధిలోనే దీన్ని నిర్మించారు. దీంట్లో వెంటిలేటర్లతో కూడిన 125 ఐసీయూ పడకలు ఉండగా.. వీటిలో 25 పూర్తిగా చిన్నారులకే రిజర్వు చేశారు. ఈ 500 పకడలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బినాలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 200 ఆక్సిజన్ పడకలతో ఆస్పత్రిని ప్రారంభించారు. అలాగే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా తన నియోజకవర్గమైన ఆమేఠీలో రూ.75లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు దిల్లీలోని తొమ్మిది ఆస్పత్రుల్లో 22 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు.
>AP : రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి . గత 24 గంటల్లో 6952 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 11,577 మంది కోలుకోగా , రికవరీల సంఖ్య 16,99,775 కు పెరిగింది .
> తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,20,525 శాంపిల్స్ పరీక్షించగా.. 1771 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో కొత్తగా 13మంది మరణించారు. రికవరీ రేటు 95.74శాతం ఉండగా.. మరణాల రేటు 0.57శాతంగా ఉంది. మరోవైపు, దేశ రాజధాని నగరం దిల్లీలోనూ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 71,513 శాంపిల్స్ పరీక్షించగా.. 213 కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 28మంది మరణించగా.. 497మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 0.30శాతానికి తగ్గింది.
> అమెరికాలోనూ కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టనున్నట్టు ప్రముఖ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్ మార్కెటింగ్ దరఖాస్తు ఆధారంగా అక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏయే ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు? ఎంతమంది వాలంటీర్లు పాల్గొంటారనే వివరాలను మాత్రం ఆ సంస్థ ఇంకా వెల్లడించలేదు. కొవాగ్జిన్‌ను విదేశాల్లోనూ మార్కెటింగ్ చేయాలని భావిస్తున్న భారత్ బయోటెక్ సంస్థ.. అందుకోసం ఆక్యుజన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది.
> భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకొంటోంది. నిన్న ఒక్కరోజే 34.3లక్షల డోసులకు పైగా పంపిణీ చేశారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 25,87,41,810 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. వీటిలో 24,76,58,855 డోసులను (వృథాతో కలిపి) వినియోగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇంకా 1.12 కోట్లకు పైగా డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. రానున్న మూడు రోజుల్లో మరో పది లక్షల డోసులు రాష్ట్రాలకు చేరనున్నట్లు పేర్కొంది.
> దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రూపొందించిన కొవిన్ వ్యవస్థ హ్యాకింగ్ గురైందని, అందులోని సమాచారం లీక్ అయిందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అలాంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపారేసింది. ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీనిపై విచారణ జరిపినట్టు వెల్లడించింది. డార్క్‌వెబ్‌కు చెందిన హ్యాకర్స్ పేర్కొన్నట్లుగా హ్యాకింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై ఏర్పాటైన సాధికార గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు. ప్రజల డేటా సురక్షితంగా ఉన్నట్టు స్పష్టంచేశారు.
> కొవిడ్‌తో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. తక్షణ గ్రాంటు కింద రూ.లక్ష ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేంతవరకూ నెలకు రూ.2500చొప్పున ఇస్తారు. 18 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ.5లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కరోనా బాల్‌కల్యాణ్ యోజన కింద ఉచితంగా ఉన్నత, సెకండరీ విద్యను అందించనున్నారు. కరోనాతో భర్తను కోల్పోయిన మహిళకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా, నెలకు 1500 పింఛను; వారి పిల్లలకు నెలకు రూ.1000, పుస్తకాలు, బట్టలకు రూ.2500ల చొప్పున ఇవ్వనున్నారు.
Thanks for reading corona: Soothing ‘Positive’ News!
No comments:
Post a Comment