PM MODI: తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్ బోధన!
నూతన విద్యావిధానం విప్లవాత్మకమన్న ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేశారు. ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యానభ్యసించబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దాంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘నూతన విద్యా విధానం ద్వారా యువతకు దేశం పూర్తిగా తమ వెంటే ఉందని, తమ ఆకాంక్షలకు మద్దతు ఇస్తోందన్న భరోసా కలుగుతుంది. మాతృభాషల్లో విద్యను అందించడం దీంట్లో అత్యంత కీలకం. కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనందిస్తుంది. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుంది. కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకొనేలా ప్రోత్సహిస్తుంది. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరం. 21వ శతాబ్దపు యువత తమదైన శైలిలో కొత్త దారులను వెతుక్కొనేందుకు స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వాలి. కరోనా కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో బోధనా పద్ధతిని త్వరగా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారు. కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకొనే సదుపాయం కలుగుతుంది. విద్యార్థులు తమ మాతృభాషలోనే విద్యనభ్యసించేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. వారికి భాషలు ఎంపిక చేసుకొనే సౌలభ్యం ఉంది. ఏ తరమైతే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా లబ్ధి పొందుతుందో.. అదే తరం రేపు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ-లెర్నింగ్ పోర్టల్ ‘దీక్ష (DIKSHA)’ గురించి ప్రస్తావించిన మోదీ.. నిత్యం దాదాపు ఐదు కోట్ల హిట్స్ సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం 2300 కోట్ల వీక్షణలు వచ్చాయని తెలిపారు. దేశ యువత మార్పుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కలలను నేరవేర్చడానికి ఈ దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
Thanks for reading PM MODI: Teaching engineering in 5 languages including Telugu!
No comments:
Post a Comment