Investments: 30 ఏళ్ల వయసులో ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?
మన దేశంలో 47% జనాభా 30 ఏళ్ల లోపువారే. వీరందరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సంపాదన కూడా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ప్రవేశించినా దూకుడుగా ఉండే అవకాశమే ఎక్కువ.
30 ఏళ్ల వయసులో పెట్టుబడులపై కొద్దిగా రిస్క్ తీసుకోవడమే ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఉన్న ఖర్చులు.. 20, 30 ఏళ్ల తర్వాత అప్పటి ద్రవ్యల్బణాన్ని బట్టి ఏర్పడే ఖర్చులు పరిగణనలోకి తీసుకోవాలి.
పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆదా..
మీరు నెలవారీ సంపాదనలో 25% కంటే ఎక్కువ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మీ నెలవారీ జీతం రూ.40 వేలు అనుకుందాం. మీ ఖర్చులను రూ.30 వేలకు పరిమితం చేస్తూ... రూ.10 వేలు తప్పనిసరిగా ఆదా చేయాలి. జీతం పెరిగే కొద్ది అదే నిష్పత్తి నిరాటంకంగా కొనసాగించాలి.
పెట్టుబడి వ్యూహం
చాలా మంది సురక్షితంగా ఉండే బ్యాంకు డిపాజిట్ ఎంచుకుంటారు. బ్యాంకు డిపాజిట్‌లు స్వల్పకాలానికే మంచి పెట్టుబడులు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి అందించవు. కాబట్టి, కాలం గడిచే కొద్దీ ఇందులో మీ ఖర్చులు పెరిగినా మీ రాబడి పెరగదు. వీటి బదులు మీరు ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్స్ ఎంచుకుని అందులో సిప్ చేయడం మేలు. పెట్టుబడిని ప్రతి ఏడాది 10% పెంచడానికి ప్రయత్నించండి. జీతం పెరిగే కొద్దీ ఇదే పద్ధతి కొనసాగించండి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 10-12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. మీరు నెల నెలా రూ.10 వేలతో సిప్ మొదలు పెట్టారనుకుందాం. పెట్టుబడి ప్రతి ఏడాది 10% పెంచుతూ వెళితే.. 10 ఏళ్లలో దాదాపు రూ.31 లక్షలు అవుతుంది. ఇంకా మీరు మీ పదవీ విరమణ, అంటే 60 సంవత్సరాల వయసు వరకు ఈ పెట్టుబడులు పెంచుతూ వెళితే .. సుమారుగా రూ.6-8 కోట్ల వరకు సమకూర్చుకోవచ్చు.
బీమా
కనీసం రూ.1 కోటి కవరేజీతో సరైన టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి. బీమా హామీ మీ వార్షిక ఆదాయానికి 12-15 రెట్లు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. ఆరోగ్య రక్షణ కోసం కనీసం రూ.5-10 లక్షల ఆరోగ్య బీమాను కొనుగోలు చేయండి. జీవితంలో ఊహించని సంఘటనల నుంచి బీమా కవరేజీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడతాయి. మీ ఆర్థిక ప్రణాళికను చెక్కుచెదరకుండా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
అత్యవసర నిధి
దైనందిన జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల స్వల్పకాలానికి ఆదాయం ఉండకపోవచ్చు లేక తగ్గవచ్చు. ఆదాయ పరిస్థితి ఎలా ఉన్నా గానీ, ఖర్చుల నిర్వహణ తప్పదు. ఇటువంటి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోడానికి మీ నెలవారీ ఆదాయానికి 8-12 రెట్లు సరిపడా అత్యవసర నిధి బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంచాలి. ఈ నిధిని సమకూర్చుకోవడానికి మీ నెలవారీ జీతంతో పాటు మీ వార్షిక ఇన్సెంటివ్స్, బోనస్ లేదా ఇతర రీయింబర్స్‌మెంట్లను ఉపయోగించవచ్చు.
ఇంటి కొనుగోలు అవసరమేనా?
మీకు ఇప్పటికే ఇల్లు ఉన్నా, తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా ఇంటిని కలిగి ఉన్నా.. మీ ఆదాయం టాక్స్ పరిధిలో లేకపోతే కనీసం ఒక దశాబ్దం పాటు సొంత ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద కొనుగోలు ఇల్లే. గృహరుణాన్ని తీసుకుంటే 2 దశాబ్దాల పాటు ఈఎంఐలు చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం తక్కువ ఉన్నవారికి ఇది ఇబ్బందే. ఇది మీ పెట్టుబడులకు ఆటంకంగా మారొచ్చు. కాబట్టి, తగినంత కాలం అద్దె ఇల్లు కూడా మంచిదే.
Thanks for reading Investments: What should be the financial plan at the age of 30?
No comments:
Post a Comment