శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే శాస్త్రం ప్రకారం కృష్టాష్టమి నాడు 102 రకాల పిండి వంటలు చేయాలి. ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి. వాటిని ముందు మనం ఆరగించి ఇతరులకు పంచిపెట్టాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శెనగపప్పు వంటి వాటిని కూడా నివేదన చేస్తారు.
అలాగే శొంఠితో తయారుచేసిన కట్టెకారం, పంచదార కలిపిన మినప్పిండి కూడా ప్రసాదంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనించదగిన విషయం. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు. అంటే ఆయనకు జన్మనిచ్చిన దేవకీ దేవి, మాయకు జన్మనిచ్చిన యశోదా దేవి ఇద్దరూ బాలింతలే. కాబట్టి ఇలాంటి ఆహారం పెట్టడానికి వారే కారణమై ఉండచ్చు. కృష్ణాష్టమి నాడు చిన్నికృష్ణుడికి పెట్టే కొన్ని రకాల ప్రసాదాలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
అటుకులు, బెల్లం లడ్డు (Jaggery Laddu)
కావాల్సినవి: అటుకులు రెండు కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, పుట్నాలు అరకప్పు, బెల్లం పొడి కప్పు, వేడిపాలు తగినన్ని.
అటుకులు, కొబ్బరిముక్కలు, పుట్నాలపప్పును విడివిడిగా మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. ఓ పళ్లెంలో వీటన్నింటినీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెల్లం పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోసి కలుపుతూ గుండ్రటి ఉండల్లా చుట్టుకోవాలి.
కొబ్బరి లడ్డు (Coconut Laddoo)
కావాల్సినవి: కొబ్బరి కాయ – ఒకటి, పాలు – లీటరు, బొంబాయి రవ్వ – అరకప్పు, చక్కెర – సరిపడినంత, యాలకుల పొడి కొద్దిగా
కొబ్బరికాయను పగలగొట్టి తురుము తీసి పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెర వేసి మరగనివ్వాలి. మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత గిన్నెను పొయ్యి మీద నుంచి దింపి చల్లారిన తర్వాత లడ్డూల మాదిరిగా తయారుచేసుకుంటే సరిపోతుంది.
శెనగపప్పు పాయసం
కావాల్సినవి: శెనగపప్పు – కప్పు, బెల్లం పొడి – ముప్పావు కప్పు, పాలు – కప్పు, నెయ్యి – టేబుల్ స్పూన్, యాలకుల పొడి – కొద్దిగా, జీడిపప్పు, బాదంపప్పు – కొద్దిగా.
కుక్కర్లో కప్పున్నర నీరు పోసి దానిలో శెనగపప్పు వేసి.. నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఈ లోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. దీని కోసం గిన్నెలో పావుకప్పు నీరు పోసి స్టవ్ పై పెట్టాలి. దీనిలో బెల్లం తురుము వేసి సన్నని మంటపై నీరు ఇంకేదాకా మరిగించాలి.
మరో ప్యాన్‌లో నెయ్యి వేసి.. అది వేడెక్కిన తర్వాత మెత్తగా ఉడికిన శెనగపప్పు వేసి.. రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో పాలు పోసి.. సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లంపాకం, యాలకుల పొడి వేసి స్టవ్ మీద రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, బాదంపప్పు వేస్తే సరిపోతుంది.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
Thanks for reading శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
No comments:
Post a Comment